Nirav Modi: బ్రిటన్ నుంచి కూడా నీరవ్ మోదీ జంప్.. బ్రస్సెల్స్‌కు పారిపోయిన వైనం!
- ఇంటర్ పోల్ సాయం కోరిన సీబీఐ
- సింగపూర్ పాస్ పోర్టు సాయంతో బ్రిటన్ నుంచి పరారీ
- దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మోసానికి పాల్పడిన నీరవ్
భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ నుంచి బ్రస్సెల్స్‌కు పారిపోయాడు. లండన్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వేళ అక్కడి నుంచి పారిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం, లేదంటే బుధవారం అతడు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నీరవ్ మోదీ పరారీపై బ్రిటన్ ప్రభుత్వం నుంచి భారత దౌత్య కార్యాలయానికి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు.
భారత్‌లో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ బ్రిటన్‌లో తలదాచుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పరారైన ఆయన భారత పాస్‌పోర్టుతో కాకుండా సింగపూర్ పాస్‌పోర్టుపై పలాయనం చిత్తగించినట్టు తెలుస్తోంది.
భారత దర్యాప్తు సంస్థ సీబీఐ సోమవారం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. నీరవ్ మోదీ, ఆయన సోదరుడు నిషాల్‌కు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా కోరింది. మరోవైపు, మంగళవారం ముంబైలోని స్పెషల్ కోర్టు నీరవ్ మోదీ, అతడి కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.