Madhya Pradesh: కాంగ్రెస్ నేతల తల్లులను ఉద్దేశించి బీజేపీ నేత తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు!

  • 'గరీభీ హఠావో' అంటూ పేదలను నిర్మూలించారు
  • కొందరు తల్లులు అలాంటి నేతలకు జన్మనిచ్చారు 
  • కలకలం రేపుతున్న మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే శాక్యా వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పెట్టవద్దని, ఏవైనా ప్రసంగాలు చేసే సమయంలో సంయమనంతో మాట్లాడాలని బీజేపీ అగ్ర నేతలు ఎంతగా చెబుతున్నా, స్థానిక నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా, కాంగ్రెస్ నేతల తల్లులను ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 కాంగ్రెస్ ఇచ్చిన 'గరీభీ హఠావో' నినాదాన్ని ప్రస్తావించిన ఆయన, ఆ పార్టీ పేదలను నిర్మూలించిందని ఆరోపిస్తూ, కొందరు మహిళలు ఇటువంటి సమాజాన్ని చెడగొట్టే నాయకులకు జన్మనిస్తున్నారని, అటువంటి వాళ్లు పిల్లలను కనేకంటే, పిల్లలు లేని మహిళలుగా మిగిలిపోతే దేశానికి మేలు జరిగుండేదని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం గుణలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన, కుసంస్కారులను కనడం కంటే సంతాన హీనులుగా మిగిలిపోయుంటే బాగుండేదని అన్నారు.

శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యను ప్రతి మహిళా రోల్ మోడల్ గా తీసుకోవాలని అన్నారు. శాక్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో గుణ ప్రభుత్వ కాలేజీలో బాలికలకు సేఫ్టీ టిప్స్ ఇస్తూ, బాయ్ ఫ్రెండ్స్ ను తయారు చేసుకోకుంటే, ఎవరికీ ఎటువంటి వేధింపులు, అత్యాచారాలు ఎదురు కాబోవని వ్యాఖ్యానించి విమర్శలు కొని తెచ్చుకున్నారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనీ శాక్యా వదిలిపెట్టలేదు. ఇండియాలో డబ్బును సంపాదిస్తున్న కోహ్లీకి, ఈ దేశం అంటరానిది అయిపోయిందా? అని ప్రశ్నిస్తూ, తన వివాహ వేదికను ఇటలీలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పాలని అప్పట్లో నిలదీశారు. దేశంపై కోహ్లీకి గౌరవం లేదని, ఇక్కడ సంపాదించిన కోట్ల రూపాయల డబ్బును, తన పెళ్లి కోసం ఇటలీలో ఆయన ఖర్చు పెట్టాడని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News