team india: ఉతికి ఆరేసిన శిఖర్ ధావన్.. భారత టెస్ట్ చరిత్రలోనే ఘనమైన రికార్డు సొంతం
- తొలి సెషన్ లోనే సెంచరీ సాధించిన ధావన్
- 99 పరుగుల సాధించిన సెహ్వాగ్ రికార్డు బద్దలు
- 94 పరుగులతో ఆడుతున్న మురళీ విజయ్
బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ రహానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మురళీ విజయ్, శిఖర్ ధావన్ లు ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 248 పరుగులు.
96 బంతులను ఎదుర్కొన్న ధావన్ 3 సిక్సర్లు, 19 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చివరకు యమిన్ అహ్మద్ జాయ్ బౌలింగ్ లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ లో మరెవరూ సాదించలేని ఘనతను సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ రోజు లంచ్ సమయానికంటే ముందే సెంచరీ కొట్టిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గా ధావన్ అవతరించాడు. లంచ్ విరామానికి ధావన్ 104 పరుగులు సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. 2006లో సెయింట్ లూసియాలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో వీరూ 99 పరుగులు చేశాడు.
మురళీ విజయ్ 94 పరుగులతో సెంచరీ దిశగా దూసుకు పోతున్నాడు. ధావన్ ఔట్ అయిన తర్వాత బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడుతూ 33 పరుగులతో ఆడుతున్నాడు. తన మ్యాజిక్ బౌలింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రషీద్ ఖాన్ ఇప్పటి వరకు సత్తా చాటలేకపోయాడు. 14 ఓవర్లు బౌలింగ్ చేసి, ఏకంగా 89 పరుగులు సమర్పించుకున్నాడు.