niti ayog: నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు
- నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష
- రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్న సీఎం
- పోలవరం విషయంలో వాదనలు గట్టిగా వినిపిద్దాం
ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, విభజన సమస్యలపై అమరావతిలో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా 10.5 శాతం వృద్ధి రేటును సాధించామని చెప్పారు.
నిధుల కోసం ఇబ్బందులు పడుతున్నా పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నామని... డయాఫ్రం వాల్ ను విజయవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం విషయంలో మన వాదనలను గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా నిధుల విడుదలలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. లెక్కలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబడదామని చెప్పారు.