shujaat bukhari: ఉగ్రవాదుల ఘాతుకం.. ‘రైజింగ్ కశ్మీర్’ ఎడిటర్ దారుణ హత్య
- షుజాత్‌ను ఆయన కార్యాలయం ఎదుటే కాల్చిచంపిన ఉగ్రవాదులు
- కశ్మీర్ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకే?
- తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పాత్రికేయ ప్రపంచం
శ్రీనగర్‌లో దారుణం జరిగింది. ఓ పత్రికా ఎడిటర్‌ను ఆయన కార్యాలయం ఎదుటే ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. శ్రీనగర్‌లోని ‘రైజింగ్ కశ్మీర్’ పత్రిక సంపాదకుడు షుజాత్ బుఖారీ కశ్మీర్ శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు కార్యాలయం నుంచి బయటకు రాగానే అక్కడే కాపుకాసిన ఉగ్రవాదులు అతి సమీపం నుంచి షుజాత్‌ను కాల్చి చంపారు. ఆయన సెక్యూరిటీ గార్డు, వాహన డ్రైవర్‌పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
షుజాత్ హత్య విషయం తెలియగానే జర్నలిస్టులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. షుజాత్ హత్యను ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. కశ్మీరులో విధులు నిర్వర్తించడం జర్నలిస్టులకు పెను సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులకు భద్రత కల్పించాలంటూ కశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది. షుజాత్‌ను హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు.
శ్రీనగర్‌కు చెందిన షుజాత్ గతంలో హిందూ పత్రిక శ్రీనగర్ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. ప్రస్తుతం కశ్మీర్ మీడియాలో ప్రముఖులుగా ఉన్నవాళ్లలో చాలామంది ఆయన వద్ద పనిచేసిన వారే. షుజాత్ గతంలోనూ మూడుసార్లు ఉగ్రవాదుల బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
ఉగ్రవాదుల దుశ్చర్యను పార్టీలకతీతంగా దేశంలోని నేతలంతా ఖండించారు. షుజాత్ హత్య హేయమని సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది పిరికిపంద చర్య అని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. షుజాత్ హత్య తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.