Donald Trump: కిమ్‌తో చర్చల ఎఫెక్ట్: నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్!
- ట్రంప్‌ను నామినేట్ చేసిన నార్వే ఎంపీలు
- వచ్చే ఏడాది పరిశీలించనున్న నోబెల్ కమిటీ
- ఉభయ కొరియాల మధ్య శాంతి కోసం చేస్తున్న కృషికి ఫలితంగానే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చల కోసం ట్రంప్ చేస్తున్న కృషిని గుర్తించిన ఇద్దరు నార్వే ఎంపీలు ఆయన పేరును నామినేట్ చేశారు. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్‌తో సింగపూర్‌లో మూడు రోజుల క్రితం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయి. అలాగే, ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వానికి చరమ గీతం పాడేలా ట్రంప్ కిమ్‌ను ఒప్పించారు. అమెరికా స్పష్టమైన హామీ ఇస్తే అణ్వస్త్ర నిరాయుధీకరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కిమ్ చెప్పడం గొప్ప మలుపుగా అభివర్ణిస్తున్నారు.
ట్రంప్-కిమ్ చర్చలు చారిత్రాత్మకమని పేర్కొన్న నార్వేకు చెందిన గవర్నింగ్ ప్రోగ్రెస్ పార్టీ ఎంపీలు.. ట్రంప్‌ను శాంతి బహుమతి కోసం నామినేట్ చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది నోబెల్ బహుమతికి జనవరితో నామినేషన్ గడువు ముగియడంతో తాజా నామినేషన్ వచ్చే ఏడాది పరిశీలించనున్నారు.