Donald Trump: చైనాపై టారిఫ్ లు విధించే ప్రణాళికకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
- చైనా నుంచి వచ్చే దిగుమతులపై భారీ టారిఫ్ లు
- 35-40 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై విధించే అవకాశం
- చైనాతో అమెరికా వాణిజ్య లోటు 375 బిలియన్ డాలర్లు
చైనాతో అమెరికా సయోధ్యకు వచ్చినట్టే కనిపించినా, ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో సామరస్యంగా వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు ట్రంప్ తాజా నిర్ణయమే నిదర్శనం. చైనా ఉత్పత్తులపై పెద్ద ఎత్తున టారిఫ్ లు విధించే ప్రణాళికకు ఈ రోజు ట్రంప్ ఆమోదం తెలిపారు. దీంతో చైనాతో మళ్లీ ఘర్షణకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. చైనా అనైతిక వాణిజ్య విధానాలపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ప్రచారం చేసుకున్నారు. తన హామీని ఈ విధంగా ఆయన అమల్లో పెడుతున్నారు.
అయితే, ట్రంప్ చర్య, ఉత్తర కొరియాతో చర్చల విషయంలో చైనా సహకారం దూరం కావడానికి దారితీస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. టారిఫ్ లు విధించే ప్రణాళికకు ఆమోదం తెలిపే ముందు ట్రంప్ పలువురు కేబినెట్ సభ్యులు, వాణిజ్య సలహాదారులతో సమావేశమై చర్చలు జరిపారు. 35-40 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులపై టారిఫ్ లను విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే చైనాతో మళ్లీ వివాదానికి దారితీసే అవకాశాలుంటాయి. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వివాదం మిగిలిన దేశాలపైనా ప్రభావం చూపిస్తుంది. చైనాతో అమెరికాకు 375 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంది. ఈ లోటును లేకుండా చేయాలన్నది ట్రంప్ లక్ష్యం.