Vijayawada: కొండపల్లి ఖిల్లా ఆధునికీకరణ పనుల్లో అలసత్వంపై కార్యదర్శి ఆగ్రహం
- కోట్లాది రూపాయల నిధులు కేటాయించి నెలలు గడుస్తోంది
- పనుల్లో ఎటువంటి పురోగతి లేదు
- ఖిల్లాను సందర్శించిన పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న కొండపల్లి ఖిల్లా ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న అలసత్వంపై పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి ఖిల్లాను ఈరోజు ముఖేష్ కుమార్ మీనా ఆకస్మికంగా సందర్శించారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇక్కడ రూ.7.4 కోట్ల అంచనా వ్యయంతో వివిధ రకాల పనులు చేపట్టగా, అవి నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ నేతృత్వంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్ను తీవ్రంగా మందలించారు. పనుల ఆలస్యానికి సంబంధించి అక్కడ ఉన్న గుత్తేదారు ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనివారిని పెంచి వెంటనే పనులు పూర్తి చేయాలని, ఇకపై ప్రతి పదిహేను రోజులకు వస్తానని, మార్పు కనిపించాలని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన అధికారులు సోమవారం 11 గంటలకు పూర్తి సమాచారంతో సచివాలయానికి రావాలని ఆదేశించారు.ఇప్పటికే పనులు ప్రారంభించి ఐదు నెలలు కాగా, నిబంధనల ప్రకారం మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తి కావటాన్ని తప్పుబట్టారు. మరోవైపు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఖిల్లాలో ఇష్టానుసారం నిర్మాణాలు చేయడాన్ని ఆక్షేపించారు. కోట గోడ వెంబడి లోపలి వైపున నిర్శించిన శౌచాలయాలను కూల్చివేయాలని, కోట అందాన్ని వాస్తవికతను దూరం చేసేలా ఏర్పాటు చేసిన చెత్త కుండీలను తొలిగించి మరో చోట నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సందర్శకులు కోటను సందర్శించేందుకు వచ్చే ప్రధాన మార్గం ఇరుకుగా ఉండటంతో దానిని వెడల్పు చేయాలని, అక్కడ సాధ్యం కాకుంటే మరో చోట ప్రధాన ద్వారాన్ని నిర్మించి తదనుగుణంగా టిక్కెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ.7.4 కోట్లతో దర్బార్ హాల్ ఆధునికీకరణ, మ్యూజియం ఏర్పాటు, అంతరించిపోతున్న కోట శిథిలాల పునర్ నిర్మాణం వంటివి చేపట్టాల్సి ఉండగా, ఈ కోటను కాపాడుకునేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన నిధులే కాకుండా భవిష్యత్తులో కూడా నిధుల కొరత లేకుండా చూస్తామని, మరోవైపు జాతీయ రహదారి నుండి కొండకు దారితీసే మార్గంలో అటవీశాఖతో మాట్లాడి ఒక పర్యాటక విడిది కేంద్రాన్నినిర్మిస్తే ఏలా ఉంటుందన్న దానిపై అధికారులతో చర్చించారు. పర్యాటకుల రాక, పోకలు వసతుల ఏర్పాటుతో ముడిపడి ఉంటాయని తదనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.