Jagan: కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ వైఖరిపై స్పందించిన వైఎస్ జగన్!
- చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
- కడప జిల్లాపై చంద్రబాబు నాయుడికి విపరీతమైన ప్రేమ అట
- కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావట్లేదా? పోరాడదాం అంటున్నారు
- నాలుగేళ్లు పట్టించుకోలేదు..
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఆయన ర్యాలీలో మాట్లాడుతూ... "చంద్రబాబు ఏ స్థాయిలో డ్రామాలాడుతున్నారంటే.. కడప జిల్లాపై చంద్రబాబు నాయుడికి, ఏపీ సర్కారుకి విపరీతమైన ప్రేమ అట. 'కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావట్లేదా? రావడం లేదని బీజేపీ వారు అన్నారా? ఇవ్వడం లేదని అన్నారా? పోరాడదాం, నిరాహార దీక్ష చేస్తాం' అని చంద్రబాబు అంటున్నారు.
టీడీపీ నేతలంతా పోరాడతామని ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా వారు చేస్తోన్న ప్రకటనలు చూస్తోంటే గమ్మత్తనిపిస్తోంది. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు టీడీపీ నేతలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనూ టీడీపీ అధికారంలో ఉంది. నాలుగేళ్లు పట్టించుకోలేదు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ విషయం గుర్తుకురాలేదు.. ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు.
గతేడాది జనవరిలో చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిందని, బీజేపీ బ్రహ్మాండంగా చేస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరిగినా కేంద్ర సర్కారుదే తప్పని అంటున్నారు. హామీలు ఇచ్చింది చంద్రబాబు.. బీజేపీతో విడిపోయాక కేంద్ర సర్కారుపై అన్ని తప్పులనీ వేసేస్తున్నారు. తాను చేసేదంతా చేశానని, ఇక కేంద్ర సర్కారుదే తప్పని అంటున్నారు. కాపులకి రిజర్వేషన్ల అంశంపై కూడా మభ్యపెడుతున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎవరైనా ఉంటారా?" అని జగన్ వ్యాఖ్యానించారు.