Tamilnadu: ఇంజక్షన్ చేస్తుండగా విరిగిన సూది.. గుండెలోకి చేరుకున్న వైనం!
- వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
- ఆపరేషన్ చేసి తొలగించినట్టు చెప్పిన వైద్యులు
- గుండెలోకి చేరుకున్న సూది
వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే సంఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఓ గర్భిణికి ఇంజక్షన్ చేస్తుండగా విరిగిన సూది గుండె వద్దకు చేరుకుంది. ఫలితంగా ప్రాణాల మీదకు వచ్చింది. కుంభకోణం సమీపంలోని గోవిందపురానికి చెందిన శశికళ (23) జ్వరంతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
అక్కడి నర్సులు ఆమెకు ఇంజెక్షన్ చేస్తుండగా సూది విరిగి చేతిలో ఉండిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు చేతిలో నొప్పి ఎక్కువ కావడంతో తిరిగి ఆసుపత్రికి వచ్చిన ఆమెకు ఎక్స్రే తీసి చేతిలో సూది ముక్క ఉన్నట్టు చెప్పారు. దీంతో తంజావూరు వైద్య కళాశాలలో ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది ముక్కను తొలగించినట్టు చెప్పారు.
శుక్రవారం శశికళకు గుండె నొప్పి రావడంతో సమీపంలోనే ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లింది. అక్కడ ఎక్స్రే తీయగా గుండె సమీపంలో సూది ముక్క కనిపించింది. ఈ ఘటనపై శశికళ మాట్లాడుతూ వైద్యులు తనను మోసగించారని, ఆపరేషన్ చేసి సూదిని తొలగించినట్టు చెప్పారని కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం శశికళ మూడు నెలల గర్భవతి. ఈ ఘటనపై స్పందించేందుకు తంజావూరు వైద్య కళాశాల వైద్యులు నిరాకరించారు. మరోవైపు, తనను మోసం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా శశికళ డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.