Gauri Lankesh: నా మతాన్ని రక్షించుకునేందుకే గౌరీ లంకేశ్ ను చంపేశా!: పరశురామ్
- గౌరీ లంకేశ్‌ను చంపింది నేనే
- హత్యకు ముందు ఆమె ఎవరో నాకు తెలియదు
- చంపకుండా ఉండాల్సింది
తన మతాన్ని రక్షించుకునేందుకే జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను హత్య చేసినట్టు నిందితుడు పరశురామ్ వామోర్ (26) సిట్ అధికారుల విచారణలో వెల్లడించాడు. అయితే, తాను ఎవరిని చంపింది ఆ సమయంలో తనకు తెలియదని పేర్కొన్నాడు.
గతేడాది సెప్టెంబరు 5న బెంగళూరు ఆర్ఆర్ నగర్‌లోని తన ఇంటి బయటే గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ‘‘నా మతాన్ని రక్షించుకోవాలంటే ఒకరిని చంపాలని 2017 మే నెలలో నాకు చెప్పారు. నేను దానికి అంగీకరించాను. అయితే, నేను చంపేది ఎవరిన్నది మాత్రం నాకు తెలియదు. కానీ, ఇప్పుడనిపిస్తోంది.. ఆమెను చంపకుండా ఉంటే బాగుండునని’’ అని విచారణలో పరశురామ్ పేర్కొన్నాడు.
తనను సెప్టెంబరు 3న బెంగళూరుకు తీసుకొచ్చారని, ఎయిర్‌గన్‌ను కాల్చడాన్ని బెల్గావిలో నేర్చుకున్నానని తెలిపాడు. సెప్టెంబరు 5న గౌరీ లంకేశ్ ఇంటి వద్ద మాటు వేశానని, ఆమె కారు దిగిన తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తీస్తుండగా తాను ఆమె వద్దకు వెళ్లానని, కొద్దిగా దగ్గగానే ఆమె తనవైపు చూశారని, ఆ వెంటనే నాలుగు బుల్లెట్లు కాల్చానని పరశురామ్ వివరించాడు. అదే రోజు తాము రూముకు వచ్చి బెంగళూరు నుంచి పారిపోయినట్టు వివరించాడు.
పరశురామ్‌తోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు బెంగళూరులో రెండు ప్రాంతాల్లో ఉన్నట్టు సిట్ అధికారులు తెలిపారు. గౌరీ హత్య కేసులో కనీసం ముగ్గురికి సంబంధాలున్నాయని పేర్కొన్నారు.