congress party: బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ స్కెచ్.. భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు సిద్ధం!
- ఎక్కువ పార్టీలతో జతకట్టాలన్న ఆలోచన
- భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు సన్నద్ధం
- 2019 ఎన్నికలకు రోడ్డు మ్యాప్ ను రూపొందించే బాధ్యత ఏకే ఆంటోనీ కమిటీకి
నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీని 2019లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా సంస్థ ఈ మేరకు ఓ వార్తా కథనాన్ని రూపొందించింది. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఓ పెద్ద కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇందుకోసం భాగస్వామ్య పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాల్సి వస్తే తాను 250 సీట్లతో అయినా సరిపెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ స్థానాల్లో పోటీ చేసినట్టు అవుతుంది.
2019 ఎన్నికలకు సంబంధించి రోడ్డు మ్యాప్ ను రూపొందించే బాధ్యతను ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి రాహుల్ అప్పగించారు. ప్రజల అంచనాలు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ కమిటీ కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల అభిప్రాయాలు కోరింది. పూర్తి సంప్రదింపుల తర్వాతే ఆంటోనీ కమిటీ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయనుంది. 250 సీట్ల కంటే తక్కువకే పరిమితం కావాలని పార్టీలో ఓ వర్గం భావిస్తుండగా, గెలిచే అవకాశాలున్న వారినే బరిలోకి దింపాలని మరో వర్గం భావిస్తోంది.