Python: ఇండోనేషియాలో మాయమైన మహిళ... ఎక్కడ కనిపించిందో తెలిస్తే షాకే!
- మహిళను మింగేసిన 7 మీటర్ల పైథాన్
- కూరగాయల తోటలో ఘటన
- కొండచిలువను చంపి మృతదేహాన్ని బయటకు తీసిన ప్రజలు
ఇండోనేషియాలోని కూరగాయల తోటలో మాయమైన 54 సంవత్సరాల మహిళ వా టిబు కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న స్థానిక ప్రజలు, ఆమెను ఓ భారీ కొండచిలువ మింగేసిందని తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆమె మృతదేహం 7 మీటర్ల (సుమారు 23 అడుగులు) పొడవున్న పైథాన్ కడుపులో లభించింది.
ఈ ఘటన మునా దీవిలోని పర్సియాపెన్ లావెలా అనే గ్రామంలో జరిగింది. ఆమెను కొండచిలువ మింగేసి ఉంటుందన్న అనుమానంతో దాన్ని చంపిన గ్రామస్థులు, మృతదేహాన్ని బయటకు తీశారని స్థానిక పోలీస్ చీఫ్ హమ్కా తెలిపారు. గురువారం రాత్రి ఆమె తోటనుంచి రాకపోయేసరికి 100 మంది గ్రామస్థులు, బంధువులు వెతుకులాట ప్రారంభించగా, వారికి భారీ కొండచిలువ కనిపించిందని వివరించారు. టిబు తల వైపు నుంచి అది మింగేసిందని తెలిపారు.
కాగా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఆరు మీటర్లకు పైగా పొడవుండే కొండచిలువలు అధికంగా కనిపిస్తుంటాయి. అవి చిన్న చిన్న జంతువులను టార్గెట్ చేసుకుంటాయే తప్ప, ప్రజల జోలికి రావడం చాలా అరుదు.