Maharashtra: 'మహా'ప్లాన్... 25 నిమిషాల్లో ముంబై నుంచి పూణెకు!
- రెండు నగరాల మధ్యా హైపర్ లూప్
- అమెరికా సంస్థతో చర్చించిన దేవేంద్ర ఫడ్నవీస్
- 15 కిలోమీటర్ల డిమాన్ స్ట్రేషన్ ట్రాక్ ఏర్పాటుకు సన్నాహాలు
సాలీనా 1.5 లక్షల టన్నుల కర్బన ఉద్గారాల విడుదలను నివారించడంతో పాటు 200 కిలోమీటర్ల పొడవైన ముంబై - పూణె రహదారిపై వాహన రద్దీని తగ్గించేలా రెండు నగరాల మధ్య హైపర్ లూప్ సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య ప్రయాణానికి రోడ్డు, రైలు మార్గంలో సుమారు మూడు గంటలు పడుతుండగా, హైపర్ లూప్ విధానంలో 25 నిమిషాల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు.
హైపర్ లూప్ ఏర్పాటు కోసం యూఎస్ కు చెందిన వర్జిన్ హైపర్ లూప్ వన్ సంస్థను సంప్రదించామని మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నెవడాలో ఉన్న వర్జిన్ హైపర్ లూప్ వన్ టెస్ట్ సైట్ ను సందర్శించారని, కంపెనీ సీఈఓ రాబ్ లాయిడ్ తో ఆయన చర్చించారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అతి త్వరలోనే హైపర్ లూప్ పై అధ్యయనం చేసేందుకు సంస్థ ఇంజనీర్లు భారత్ కు రానున్నారని, ఇప్పటికే 15 కిలోమీటర్ల డిమాన్ స్ట్రేషన్ ట్రాక్ నిర్మించేందుకు పూణె మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ స్థలాన్ని ఎంపిక చేసిందని తెలిపింది. హైపర్ లూప్ నిర్మాణానికి అవరమైన 70 శాతం మెటీరియల్స్ ఇండియాలోనే లభిస్తాయని తెలిపింది.