AAP: నేటి సాయంత్రం ఢిల్లీలో ప్రధాని కార్యాలయం దిశగా ఆమ్ ఆద్మీ భారీ ర్యాలీ
- సాయంత్రం 4 గంటలకు మండి హౌస్ నుంచి ప్రారంభం
- సీఎం కేజ్రీవాల్, మంత్రుల నిరసనకు మద్దతుగా ర్యాలీ
- ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేయకుండా మోదీ సర్కారు అడ్డుపడుతోందంటూ విమర్శలు
ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు సాయంత్రం భారీ ర్యాలీ తలపెట్టింది. సాయంత్రం నాలుగు గంటలకు మండి హౌస్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనుంది. మోదీ నియంతృత్వాన్ని నిరసిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముందు బైఠాయించగా, వారికి మద్దతుగా పార్టీ ఈ రోజు భారీ ప్రదర్శన ర్యాలీ తలపెట్టింది.
‘‘మోదీ ప్రభుత్వం తన అధికారాలను, వ్యవస్థలను నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తూ, ఢిల్లీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా అడ్డుపడుతోంది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా అన్నారు. ప్రజలకు ఉచితంగా నీరు, తక్కువ ఖర్చుకే విద్యుత్, మంచి విద్యా వ్యవస్థను అందించిన ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు నిరసన ప్రదర్శనలో పాల్గొననున్నారని చెప్పారు.