Chandrababu: మీరు కూడా సీఎంగా ఉన్నారు.. మరో సీఎం బాధను అర్థం చేసుకోండి: నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు సూటి వ్యాఖ్యలు
- రాజ్ నాథ్ అడ్డుకున్నా.. 20 నిమిషాలు ప్రసంగించిన చంద్రబాబు
- 13 పేజీల నివేదికను చదివి వినిపించిన సీఎం
- కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తిన వైనం
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే చేశారు. విభజన సమస్యలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన గళమెత్తారు. తన ప్రసంగాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆగకుండా... 20 నిమిషాల పాటు ప్రసంగించారు. 13 పేజీల నివేదికను సమావేశంలో ఆయన చదివి వినిపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన లేవనెత్తిన డిమాండ్లు, ప్రతిపాదనలు...
- రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలి.
- జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు వెంటనే నిధులను మంజూరు చేయాలి.
- రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తామన్న నిధులను ఇవ్వాలి.
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
- విభజన హామీలన్నింటినీ అమలు చేయాలి.
- పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి.
- రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ. 350 కోట్లు విడుదల చేయాలి.
- గృహ నిర్మాణం, వైద్యానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి.
- రైతులు చెమటోడ్చి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి.
- 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. విధి విధానాలను మార్చండి.
- పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో రాష్ట్రాలపై పెనుభారం పడింది.