modi: ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం.. జమిలి ఎన్నికలను ప్రస్తావించిన మోదీ
- విధివిధానాల రూపకల్పనలో సీఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారు
- ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం
- రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడుల సదస్సులు నిర్వహించుకోవడం సంతోషకరం
వాడీవేడిగా కొనసాగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లడమనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న కఠిన లక్ష్యమని చెప్పారు. వరదలతో నష్టపోయే రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటుందని తెలిపారు. దేశ భవిష్యత్తును మార్చేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. టీమ్ ఇండియాగా అన్ని సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు.
స్వచ్ఛ భారత్, డిజిటల్ లావాదేవీలు, స్కిల్ డెవలప్ మెంట్ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రులు సబ్ గ్రూపులుగా, కమిటీలుగా ఏర్పడి విధివిధానాల రూపకల్పనలో కీలక భూమిక పోషించారని మోదీ కితాబిచ్చారు. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలను ప్రభుత్వంలోని పలు శాఖల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మోదీ తెలిపారు. దీనిపై అధ్యయనానికి సహకరించాల్సిందిగా పలువురు ముఖ్యమంత్రులను కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు సూచనలు ఇవ్వాల్సిందిగా ఏపీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ముఖ్యమంత్రులను కోరారు.
ఈ సమావేశం సందర్భంగా జమిలి ఎన్నికలను ప్రధాని మరోసారి ప్రస్తావించారు. ఎన్నికల ఖర్చును తగ్గించేందుకు జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ రూ. 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోబోతోందని తెలిపారు. రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడుల సదస్సులను నిర్వహించుకోవడం సంతోషకరమని చెప్పారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని అన్నారు.