CM Ramesh: ఆమరణ దీక్షకు దిగుతా: మోదీకి లేఖ రాసిన సీఎం రమేష్
- కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయండి
- మేకాన్ సంస్థ నివేదికను పరిశీలించండి
- చర్యలు చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తా
భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ కు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మేకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని విన్నవించారు. ప్లాంట్ ఏర్పాటు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని... లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంటులను ఏర్పాటు చేయడం సాధ్యపడదని పేర్కొంటూ సెయిల్ ఇచ్చిన నివేదికతో పాటు అఫిడవిట్ ను ఇటీవల కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రజల హక్కు అని... దాన్ని సాధించడం కోసం నిరాహారదీక్షకు దిగుతానని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధానికి ఆయన లేఖ రాశారు.