cpi: నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు వెళ్లి సాధించిందేమిటి?: సీపీఐ రామకృష్ణ
- కేంద్రంతో లాలూచీకి చంద్రబాబు యత్నిస్తున్నారు
- మళ్లీ మోదీతో చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు
- చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా?
నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం అద్భుతంగా ఉందంటూ టీడీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. సీపీఐ నేత రామకృష్ణ మాత్రం ఈ సమావేశానికి చంద్రబాబు హాజరై సాధించిందేమిటని ప్రశ్నిస్తున్నారు. అర్హులకు రేషన్ కార్డులు, పక్కా గృహాలు, ఇళ్ల స్థలాల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గుంటూరులో సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ మోదీతో చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి, మోదీతో స్నేహం కోసం చంద్రబాబు చేతులు కలపడం ఏపీ ప్రజలను అవమానపరచడమేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా? అన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. ఇరవై లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కనీసం రెండు లక్షల ఇళ్లను కూడా కట్టించలేదని అన్నారు.