shivsena: పెరుగుతోన్న మద్దతు.. కేజ్రీవాల్‌తో మాట్లాడిన శివసేన చీఫ్
- ఆప్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్కారు
- మా పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే కూడా సంఘీభావం తెలిపారు
- మీడియాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తమ రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆయన చేస్తోన్న ఈ నిరసన ధర్నా ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలుపగా, తాజాగా శివసేన పార్టీ కూడా సంఘీభావం తెలిపింది.
ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీ కోసం పనిచేసే హక్కు సీఎం కేజ్రీవాల్‌కు ఉందని, ఎందుకంటే ఆప్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్కారు అని అన్నారు. తమ పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే కూడా కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని అన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా వినూత్నమైందని, ఆప్ సర్కారు ఎదుర్కుంటోన్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఉద్దవ్ థాక్రే అన్నారని సంజయ్ రౌత్ తెలిపారు.