Minister: విశాఖపట్నంలో మరో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం: కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్
- కడప, బయ్యారం ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కృషి
- సాధ్యాసాధ్యాలపై టాస్క్ఫోర్స్ నివేదిక రావాల్సి ఉంది
- నివేదిక రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా సమాచారం ఇవ్వాలి
- ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలి
కడప, బయ్యారం ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు ఆయనను బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కలిసి, కడప బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చౌదరి బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ... ఆయా ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
అయితే, సాధ్యాసాధ్యాలపై టాస్క్ఫోర్స్ నివేదిక రావాల్సి ఉందని చౌదరి బీరేంద్ర సింగ్ చెప్పారు. నివేదిక రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా సమాచారం ఇవ్వాలని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని, పాల్వంచలోని స్పాంజి ఉక్కు పరిశ్రమను తమకు అప్పగిస్తే కొత్త యంత్రాలతో తిరిగి ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, విశాఖపట్నం సమీపంలో మరో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని పేర్కొనలేదని అన్నారు.