Assom: అరుదైన ఘటన... ఏటీఎం నుంచి బయటకు రాలేక రూ. 12 లక్షలు తినేసిన ఎలుక!
- అసోంలో ఘటన
- చిత్తు కాగితాల్లా మిగిలిన కరెన్సీ
- వైరల్ అవుతున్న ఫొటోలు
ఓ వైపు ప్రజలు ఏటీఎం సెంటర్లలో డబ్బులేదు మొర్రో అని వాపోతున్న వేళ, అసోంలోని గౌహతి సమీపంలోని టిన్సుకియా లైపులి అనే ప్రాంతంలో అరుదైన ఘటన జరిగింది. ఎలా వెళ్లిందో, ఏమోగానీ, ఓ ఏటీఎంలోకి ప్రవేశించిన ఓ ఎలుక, బయటకు ఎలా రావాలో తెలియక లోపలే ఉండిపోయి రూ. 12.38 లక్షల నోట్లను తినేసింది. గత నెల19వ తేదీన ఈ ఏటీఎంలో రూ. 29.48 లక్షల విలువైన రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అధికారులు నింపారని, ఆపై ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది.
ఈ నెల 11వ తేదీన అధికారులు ఏటీఎంను ఓపెన్ చేయగా, మిగిలిన కరెన్సీ చిత్తు కాగితాల్లా కనిపించాయని, ఓ ఎలుక ఈ పని చేసిందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారని పేర్కొంది. జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాఫ్తు చేస్తున్నారని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఏటీఎంలో చిత్తు కాగితాల్లా పడివున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొందరు 'ఇది ఫేక్ న్యూస్' కావచ్చని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.