Andhra Pradesh: భానుడి ప్రకోపానికి బలి... విశాఖలో స్కూలుకెళ్లిన విద్యార్థి మృతి!
- విద్యార్థి ప్రాణాన్ని బలిగొన్న ఎండలు
- స్కూలుకెళ్లిన సాగర్ గుప్తాకు వడదెబ్బ
- పరిస్థితి విషమించి మృతి
- కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ, పాఠశాలలకు సెలవులు ప్రకటించినా, పట్టించుకోని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొంది. విశాఖపట్నంలోని చినవాల్తేరు, నేతాజీ వీధిలోని కోటక్ స్కూల్ లో సాగర్ గుప్తా అనే 11 సంవత్సరాల బాలుడు ఎండ తీవ్రతకు తాళలేక మరణించాడు.
6వ తరగతి చదువుతున్న సాగర్, ఉదయం పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆపై పరిస్థితి విషమించి మృతి చెందాడు. వడదెబ్బతో తమ బిడ్డ మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాగా, తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు, ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్కూలుకు గొడుగులు పట్టుకుని వెళుతుండం కనిపిస్తోంది. కాగా, తాము ఆదేశాలు ఇచ్చినా స్కూళ్లు నడిపిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నామని అధికారులు హెచ్చరించారు.