Jammu And Kashmir: కశ్మీర్లో బీజేపీ-పీడీపీ సంకీర్ణానికి తెర.. గవర్నర్ పాలనకు బీజేపీ డిమాండ్!
- ప్రకటించిన రామ్ మాధవ్
- పీడీపీతో మిత్రత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవు
- ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయి
- అక్కడి పౌరుల హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయి
జమ్ముకశ్మీర్‌లో బీజేపీ-పీడీపీ బంధం తెగిపోయింది. ఈ విషయంపై బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ... పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని స్పష్టం చేశారు. దీంతో గవర్నర్ పాలనకు తాము డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయని, అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని, ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్ బుఖారిని హత్య చేయడమే అందుకు ఉదాహరణని అన్నారు.
తాము జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామని, అభివృద్ధి కోసం ప్రయత్నం చేశామని రామ్ మాధవ్ అన్నారు. అయితే, జమ్ము, లడఖ్‌లో అభివృద్ధి పనులు జరిపే క్రమంలో తమ నాయకులు ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాగా, అమర్నాథ్ యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెర్చ్ ఆపరేషన్ నిలిపేశామని చెప్పారు.