bjp: పీడీపీ-బీజేపీ సంకీర్ణానికి తెరపడటంపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
- ఇతరుల సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవాలని బీజేపీ చూస్తుంటుంది
- అదే విధంగా కశ్మీర్లో వారి సంకీర్ణాన్ని బ్రేక్ చేసింది
- బీజేపీ ఇలా చేసి చేతులు కడిగేసుకుందా?
బీజేపీ, ప్రధాని మోదీ పాలనపై తరచుగా విమర్శలు గుప్పించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా కశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం ముగియడంపై స్పందించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘ఇతరుల సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవాలని ఏ విధంగానైతే బీజేపీ ప్రార్థిస్తుంటుందో.. వేచిచూస్తుంటుందో.. కశ్మీర్లో వారి సంకీర్ణాన్ని కూడా బీజేపీ అలాగే బ్రేక్ చేసింది..ఇలా చేసి చేతులు కడిగేసుకున్నారా?.. లేక.. 2019 ఎన్నికల్లో వెనుకడుగు పడుతోందనేందుకు సూచనలా..?’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్లో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నాడు మోదీ చేసిన ట్వీట్ గురించి ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు. ‘జే&కే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చారిత్రక అవకాశం పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి లభించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎన్నడూ చూడనంత ముందుకు తీసుకెళ్తాం’ అని మోదీ పేర్కొనడం గమనార్హం.