krishnapatnam port: కంటెయినర్ స్కానర్ వల్ల మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు: కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి
- అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందున్నాం
- కంటెయినర్ స్కానర్ తో మెరుగైన సేవలు
- దేశానికి కూడా మరింత ఆదాయం
కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ స్కానర్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. పోర్టులో ‘ర్యాపిస్కాన్ ఈగల్ పీ60’ (‘ఈగల్ పీ60')ని అందుబాటులోకి తెచ్చినట్టు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్) పేర్కొంది. దీనివల్ల కంటెయినర్ స్కానింగ్ సమయం తగ్గడంతోపాటు పోర్టు భద్రత కూడా పెరుగుతుందని తెలిపింది. డైరక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డాక్టర్ జాన్ జోసెఫ్ ఈ స్కానర్ సాంకేతికతను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేపీసీఎల్ సీఈవో అనిల్ యెండ్లూరి మాట్లాడుతూ, అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కృష్ణపట్నం పోర్టు ముందంజలో ఉందని తెలిపారు. తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి కంటెయినర్ స్కానర్ ఉపయోగపడుతుందని చెప్పారు. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పోర్ట్ కార్యకలాపాలు మెరుగుపడటమే కాకుండా, దేశానికి మరింత ఆదాయం చేకూరుతుందని తెలిపారు.