PDP: పీడీపీతో బీజేపీ తెగదెంపుల వెనక అసలు కారణం ఇదే!
- ఆరెస్సెస్ సూచనతోనే పీడీపీతో తెగదెంపులు
- రాష్ట్రంలోని హిందువుల్లో బీజేపీపై వ్యతిరేకత
- పీడీపీ ఆధిపత్య ధోరణి మరో కారణం
జమ్ముకశ్మీర్‌లోని మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వెనక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. పీడీపీతో పొత్తు వల్ల జమ్ముకశ్మీర్‌లోని హిందువుల్లో బీజేపీ పట్టు కోల్పోతోందని, మున్ముందు ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాగలదని ఆరెస్సెస్ భావించింది. ఈ విషయాలను బీజేపీ అధిష్ఠానానికి చెప్పడం వల్లే సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది.
వారం రోజుల క్రితం హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ నేతలు సమావేశమయ్యారు. మూడు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై చర్చ జరిగింది. వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ తీవ్రంగా దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని నేతలు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పీడీపీతో కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో పీడీపీ ఆధిపత్య ధోరణి కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. గవర్నర్ పాలన ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. పాలనపై పూర్తి అధికారం ఉంటే రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదుల పీచమణచవచ్చని భావిస్తోంది. ఈ కారణంగానే పీడీపీ నుంచి బీజేపీ బయటకు వచ్చినట్టు సమాచారం.