Jammu And Kashmir: రాజముద్ర వేసిన కోవింద్... జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన షురూ!
- నిన్న విడిపోయిన పీడీపీ - బీజేపీ
- ఆ వెంటనే రాష్ట్రపతికి రిపోర్టు పంపిన గవర్నర్
- పాలనను ఆయన చేతుల్లో పెడుతూ ఉత్తర్వులు
జమ్మూ కశ్మీర్ లో బీజేపీ - పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 24 గంటల్లోపే, పాలనను గవర్నర్ చేతుల్లో పెడుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దస్త్రాలపై సంతకం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో తమకున్న అనుబంధాన్ని నిన్న బీజేపీ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయగా, రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా తన నివేదికను రాష్ట్రపతికి పంపుతూ, కేంద్ర పాలనకు సిఫార్సు చేశారు.
అదే రిపోర్టు కాపీని కేంద్ర హోమ్ శాఖకు కూడా పంపారు. ఇక, రాష్ట్రపతి తన వద్దకు వచ్చిన దస్త్రాలను పరిశీలించి, గవర్నర్ వోహ్రా చేతుల్లో పాలనా బాధ్యతలను ఉంచారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.