Jammu And Kashmir: 'గవర్నర్ నుంచి ఫోన్' అనగానే ఆశ్చర్యపోయిన మెహబూబా ముఫ్తీ!
- పీడీపీ - బీజేపీ కటీఫ్
- మద్దతు ఉపసంహరణ విషయాన్ని స్వయంగా తెలిపిన గవర్నర్
- డైరెక్టుగా గవర్నర్ కే సమాచారం ఇచ్చిన బీజేపీ
నిన్న మధ్యాహ్నం సమయంలో, తన కార్యాలయంలో కూర్చుని ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్న వేళ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి, గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్, అందులోని సమాచారం ఆశ్చర్యాన్ని కలిగించాయి. గవర్నర్ వోహ్రా మాట్లాడతారని ఆమెకు చెప్పిన అధికారులు, ఫోన్ ఆమెకు ఇవ్వగా, విషయం ఏమై ఉంటుందా అని ఆమె ఫోన్ తీసుకున్నారు. ఆపై వెంటనే సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకున్నట్టు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
సాధారణంగా మద్దతు ఉపసంహరించుకునే పార్టీ తొలుత భాగస్వామ్య పార్టీకి చెబుతుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కవీందర్ గుప్తా, మద్దతు ఉపసంహరణపై మెహబూబాకు సమాచారం ఇవ్వకుండా ఉండటం, గవర్నరే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఆశ్చర్యానికి గురైన ఆమె, ఆ వెంటనే తేరుకుని, తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గవర్నర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామాను సమర్పించి వచ్చారు.