Donald Trump: అమెరికాలో 52 మంది భారతీయుల అరెస్ట్... అమ్మా నాన్నల కోసం శరణాలయాల్లో బోరుమంటున్న పిల్లలు!
- వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
- తల్లిదండ్రుల నుంచి వేరుకాబడిన పిల్లలు
- ఎన్ని విమర్శలు వచ్చినా వెనుకంజ లేదంటున్న ట్రంప్
అక్రమంగా అమెరికాకు వలస వచ్చి ఉంటున్నారన్న ఆరోపణలపై వేలాది మందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, జైళ్లకు తరలిస్తుండగా, అందులో 52 మంది భారతీయులు ఉన్నారు. వీరి పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి, శరణాలయాలకు తరలించగా, అమ్మానాన్నలు కనిపించక, వారు ఎప్పుడు వస్తారో తెలియక పిల్లలు బోరున విలపిస్తున్న పరిస్థితి. అరెస్టయిన వారిని ఓరెగాన్ లోని ఫెడరల్ జైల్లో బంధించిన అధికారులు, చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి వచ్చే వారిని ఇకపై ఏ మాత్రమూ ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. గత నెలలో 123 మంది అరెస్ట్ కాగా, వారిలో అత్యధికులు దక్షిణాసియా వారే. వారిలోనూ హిందీ, పంజాబీ మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు.
ఇక మిగతా దేశాల నుంచి వలస వెళ్లి అరెస్టయిన వారిని పరిశీలిస్తే, ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. సుమారు 2 వేల మంది చిన్నారులను, వారి అమ్మా నాన్నలకు దూరం చేయగా, ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ట్రంప్ సర్కారు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆయన మాత్రం వలసదారుల విషయంలో మెత్తబడే సమస్యే లేదని స్పష్టం చేస్తున్నారు. కుటుంబం నుంచి పిల్లలను వేరు చేయాలన్న ఆలోచన అత్యంత కిరాతకమైన చర్యని ముల్ట్ నోమహ్ కౌంటీ కమిషనర్ సుశీల్ జయపాల్ వ్యాఖ్యానించారు. దీన్ని తక్షణం ఆపాలని, ఎవరి బిడ్డలను వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఇక అరెస్టు కాబడిన వారు రోజులో 22 నుంచి 23 గంటల పాటు బందీలుగా ఉంటున్నారు. వారికి కనీసం తమ న్యాయవాదితో సంప్రదించే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు. తమ జీవిత భాగస్వాములు ఎక్కడున్నారో, పిల్లలు ఏమైపోయారో తెలియని పరిస్థితి వారిది.