farmers: రైతులపై మోదీది కపట ప్రేమ.. ప్రచారమే తప్ప ఆచరణ శూన్యం: ఏపీసీసీ
- రైతులపై మోయలేని భారాలు మోపడం మోదీకే చెల్లింది
- రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్నారు
- మరోసారి వంచించారు
- ఫసల్ బీమా పథకంతో ఆయా కంపెనీలకే లాభం
రైతులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఏపీసీసీ విమర్శించింది. గడచిన నాలుగేళ్లుగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతుల బతుకులను రోడ్డుపాలు చేసిన ఘనత ఆయన సర్కారుకే దక్కుతుందని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు.
"రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతూ మోయలేని భారాలు మోపడం మోదీకే చెల్లింది. ఈరోజు మోదీ టెలీ కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖీలో మాట్లాడుతూ మీ ఆదాయం రెట్టింపు చేస్తామని మరోసారి వంచించారు. వ్యవసాయానికి రూ.2,12,000 కోట్లు కేటాయించామని చెప్పడం.. ప్రచారానికే తప్ప ఆచరణ శూన్యం. యూపీఏ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే విధంగా సహకార రుణాలను మాఫీ చేస్తే, మోదీ ప్రభుత్వం ఎరువులు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా రైతులపై మోయలేని భారం వేసింది.
గతేడాదితో పోల్చితే డీజిల్ లీటరుకు 25 రూపాయలు పెరగగా, డీఏపీ బస్తా ఒక్కింటికి రూ.200లు పైగా ధర పెరిగింది. ఇక కాంప్లెక్స్, ఇతర రకాల ఎరువుల ధరలు సగటున బస్తాకు రూ.100లు పైగానే పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రైతులందరికీ పంటల బీమా అందుతోందని, పంట పోయినా రైతు నష్టపోడని ప్రధానమంత్రి అవాస్తవాలు ప్రచారం చేయడం బాధాకరం. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే లాభం చేకూరుతున్నట్లు గడచిన రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
దీనివల్ల రైతులకు ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. పెట్టుబడి భారమై అప్పుల పాలవుతున్నారు. బాకీలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొద్దో గొప్పో పండించిన పంటలకు మద్దతు ధర కూడా ఇప్పించలేని ప్రధానమంత్రి మాటలతో రైతుల కష్టాలు తీర్చలేరు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి వుంటే తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి.
అనేక రాష్ట్రాలలో రైతులు డిమాండ్ చేస్తున్నవిధంగా రుణమాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ముఖ్య మంత్రులతో కమిటీలు వేస్తూ కాలయాపన చేయకుండా పలు రాష్ట్రాలు కోరిన విధంగా వ్యవసాయాన్ని తక్షణమే ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలి" అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.