gst: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ వచ్చినా ధరల్లో పెద్దగా మార్పుండదంటున్న అధికారి!
- గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీతో పాటు వ్యాట్
- ప్రపంచంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ పై పూర్తి స్థాయి జీఎస్టీ లేదు
- అందుకే, భారత్ లోనూ జీఎస్టీతో పాటు వ్యాట్ కూడా ఉంటుంది
ఇంధన ధరలను అదుపు చేయడానికి వాటిని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా చేయడం వల్ల, ఇంధన ధరలు హేతుబద్ధీకరించబడి, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే, వాటి ధరలు ఎలా ఉంటాయి, పన్నులు ఎలా వేస్తారనే అంశంపై కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్పష్టత నిచ్చారు.
పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చినా అవి పూర్తి స్థాయి జీఎస్టీ కిందకు రావని, ఒకవేళ చమురును వస్తు, సేవల పన్ను పరిధిలోకి చేర్చితే గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలా జరిగితే, ప్రస్తుతం ఉన్న ధరల మాదిరిగానే ఉంటాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ పై పూర్తి స్థాయి జీఎస్టీ లేదని, అందుకే, భారత్ లోనూ జీఎస్టీతో పాటు వ్యాట్ కూడా ఉంటుందని ఆ అధికారి పేర్కొన్నారు.
కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటేనే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చడం జరుగుతుందని అన్నారు. కేంద్రం ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పై రూ.19.48, డీజిల్ పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. పెట్రోల్ పై ముంబైలో అత్యధికంగా 39.12 శాతం, అండమాన్ అండ్ నికోబార్ లో అత్యల్పంగా 6 శాతం వ్యాట్ విధిస్తున్నారు.