ramana dikshitulu: రమణదీక్షితులు చెబుతున్నవి ఆరోపణలు కావు అసత్యాలు: బోండా ఉమ
- రమణదీక్షితులు శ్రీవేంకటేశ్వరుడికి క్షమాపణలు చెప్పాలి
- అసత్యాలపై ఆయన వివరణ ఇచ్చుకోక తప్పదు
- రమణదీక్షితులు దీక్షకు దిగుతాననడం బ్లాక్ మెయిల్ చేయడమే
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పదే పదే చేస్తున్నవి ఆరోపణలు కావని అసత్యాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకూ ఆయన చెప్పినవన్నీ అసత్యాలే కనుక శ్రీవేంకటేశ్వరుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరవై ఐదేళ్ల పాటు ప్రధాన అర్చకుడి పదవిలో ఉన్న రమణదీక్షితులు అసత్యాలు చెబుతున్నారని, తిరుమల వ్యవహారంపై, శ్రీవారి నగలకు సంబంధించిన అంశాలపై ఆయన స్వయంగా రాసిచ్చిన లేఖలు సంబంధిత కమిటీల వద్ద, టీటీడీ వద్ద ఉన్నాయని, వీటన్నింటినీ న్యాయస్థానం ఎదుట ఉంచుతామని చెప్పారు.
రమణదీక్షితులు చెప్పిన అసత్యాలపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. రమణదీక్షితులు దీక్షకు దిగుతానని చెప్పడంపై బోండా ఉమ స్పందిస్తూ, దీక్షకు దిగడం వలన అవాస్తవాలు వాస్తవాలు కావని, దీక్షలు చేయడం ద్వారా ఎవరినీ మభ్య పెట్టలేరని అన్నారు. స్వామి వారి భక్తులకు ఇప్పటికే వాస్తవాలు తెలిసిపోయాయని, దీక్షలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించలేరని అన్నారు. రమణ దీక్షితులు దీక్షకు దిగేముందు ఆయనకు టీటీడీ ఇచ్చిన నోటీస్ కు సమాధానం చెప్పాలి లేదా న్యాయపరంగా కోర్టులో ఎదుర్కోవాలని అన్నారు.