YSRCP: రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆలోచించేవారు.. జగన్ తన కోసం ఆలోచిస్తున్నారు: రాహుల్ గాంధీ

  • జగన్ తన కోసమే పోరాడుతున్నారు
  • వైఎస్ మీద అభిమానంతో జగన్‌ను విడిచిపెట్టొద్దు
  • ఏపీ నేతలకు రాహుల్ దిశా నిర్దేశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, జాతీయ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కె.రాజు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తదితరులతో కూడిన బృందం రాహుల్‌తో సమావేశమైంది.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ వైఎస్ వేరు, జగన్ వేరని స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి నిత్యం పేదల గురించి ఆలోచించేవారని, జగన్ ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టడం లేదని విమర్శించారు. జగన్ తన కోసం మాత్రమే పోరాడుతున్నారని, కాంగ్రెస్ పేదల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

వైసీపీలో ఉన్న నేతలందరూ కాంగ్రెస్ వారేనని, వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడి చేయాలని హితబోధ చేశారు. వైఎస్‌పై ఉన్న అభిమానంతో జగన్‌ను విడిచిపెట్టొద్దని అన్నారు. అలాగే, టీడీపీ, బీజేపీలపైనా విరుచుకుపడాలని పీసీసీ నేతలకు రాహుల్ హితబోధ చేశారు.

  • Loading...

More Telugu News