Chandrababu: రజకులను ఎస్సీల్లో చేరుస్తాం: సీఎం చంద్రబాబు
- ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూస్తాం
- డ్వాక్రా మహిళలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉంది
- అవినీతికి ఆస్కారం లేని సుస్థిర వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం
ఏపీలో రజకులను ఎస్సీల్లో చేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖపట్టణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆదాయం లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు రూ.2 వేలు చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉందని అన్నారు.
కృష్ణా జిల్లాలో భూదార్ ను విజయవంతంగా అమలు చేశామని, పదకొండు అంకెలు గల సంఖ్యతో భూదార్ ఇస్తున్నట్టు చెప్పారు. అవినీతికి ఆస్కారం లేని సుస్థిరమైన వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని చెప్పిన చంద్రబాబు, విశాఖ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, హెల్త్ సిటీని త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖలో పదహారు వందల ఎకరాల్లో క్రీడా నగరాన్ని నిర్మిస్తామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.1250 కోట్లు వెచ్చించి రహదారులు నిర్మిస్తామని చెప్పారు.