Telangana: రైతు బంధు చెక్కును వెనక్కి ఇచ్చిన రాజీవ్ కనకాల-సుమ దంపతులు
- ‘రైతు బంధు’ కింద రూ.29 వేల చెక్
- తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేసిన సుమ దంపతులు
- రైతుల సంక్షేమం కోసం ఉపయోగించాలని సూచన
తెలంగాణ ప్రభుత్వం తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి అందించాలని కోరారు. జడ్చర్ల సమీపంలోని హేమాజీపూర్‌లో రాజీవ్ కనకాల కుటుంబానికి వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు పథకంలో భాగంగా ఆ భూమికి గాను వీరికి రూ.29 వేల పెట్టుబడి సాయం కింద అధికారులు చెక్కు అందించారు.
చెక్కును తీసుకున్న రాజీవ్ కనకాల దంపతులు గురువారం గ్రామానికి వెళ్లి ఎమ్మార్వో రాంబాయిని కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు అందిన చెక్కును ఎమ్మార్వోకు అందించారు. దానిని రైతుల సంక్షేమం కోసమే ఉపయోగించాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆ స్కూలుకు గతంలో తాము విరాళంగా ఇచ్చిన ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్‌ల పనితీరును పరిశీలించారు.