India: బుకింగ్ కు 25 సెకన్లు, పేమెంట్ కు 5 సెకన్లు... రైలు టికెట్ రిజర్వేషన్ పై మారిన రూల్స్!
- అమలులోకి రానున్న కొత్త రూల్స్
- తీరికగా బుక్ చేద్దామంటే ఇక కుదరదు
- ఆధార్ వెరిఫై అయితే నెలకు 12 లేకుంటే 6 టికెట్లు మాత్రమే
ఆన్ లైన్ మాధ్యమంగా రైలు టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇకపై కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ పలు మార్పులు చేర్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం, ఒక వినియోగదారుడు ఒక ఐడీ మీద నెలకు ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. ఇక ఆధార్ వెరిఫై పూర్తి అయితే, నెలకు 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎప్పటిలానే నాలుగు నెలల ముందుగా, అంటే 120 రోజుల ముందుగా టికెట్లను పొందవచ్చు.
ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలో నిదానంగా ఉంటే కుదరదు. రైల్లో ఖాళీలు చూసుకుని టికెట్ బుక్ చేసుకునేందుకు 25 సెకన్ల సమయం మాత్రమే ఇస్తారు. పేమెంట్ కు మరో ఐదు సెకన్ల సమయాన్నేఇస్తారు. ఈలోగానే బుకింగ్ పూర్తి కావాల్సి వుంటుంది. ఇక తత్కాల్ టికెట్ల విషయానికి వస్తే, ఏసీ తరగతులకు ఉదయం 10 గంటల నుంచి, స్లీపర్ క్లాస్ కు 11 గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.
10 నుంచి 12 గంటల మధ్య ఒక యూజర్ ఐడీపై రెండు టికెట్లను మాత్రమే ఇస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ క్విక్ బుక్ సర్వీస్ అందుబాటులో ఉండదు. ఇక ఏజంట్లు తత్కాల్ టికెట్ల రిజర్వేషన్ ప్రారంభమైన అరగంట వరకూ బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఉండదు.
ఇక రిఫండ్స్ నిబంధనల సడలింపుల ప్రకారం, రైలు మూడు గంటలు ఆలస్యమైనా, దారి మళ్లినా ప్రయాణికుడికి పూర్తి చార్జీ తిరిగిస్తారు. ఫస్ట్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకుని ఇతర తరగతులకు మారితే, చార్జీల మధ్య ఉన్న తేడాను వెనక్కు ఇస్తారు. ప్రయాణానికి 24 గంటల ముందు చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్స్ అనుమతితో బుక్ చేసుకున్న టికెట్ ను మరో వ్యక్తి పేరుమీదకు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు.