Siddipet District: ఒత్తిడి తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న విలేకరి!

  • సిద్దిపేట జిల్లా కొండపాకలో విలేకరిగా పనిచేస్తున్న హనుమంతరావు
  • వ్యాపారంలో నష్టాలు, అప్పు ఇచ్చిన వారి బెదిరింపులు
  • భార్యా, బిడ్డలను హత్య చేసి, ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులకు తోడు మానసిక ఒత్తిడి అధికం కావడంతో జీవితాంతం అండగా ఉండాల్సిన భార్యను, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను చంపి, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువ జర్నలిస్ట్. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్టలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆంధ్రభూమి దినపత్రికలో సావిలి హనుమంతరావు (35) కొండపాక మండలానికి విలేకరి. ఆయనకు భార్య హారిక, ఇద్దరు కుమార్తెలు దీక్షశ్రీ (6), షైనిశ్రీ (4) ఉన్నారు. హనుమంతరావు పలు వ్యాపారాలు చేసి నష్టపోయాడు.రైతులకు సిమ్ కార్డులు, పాన్ కార్డులు జారీ చేయించే సేవలందించే షాపు నిర్వహించాడు. ఆ సమయంలో అతని వద్ద పనిచేసిన మమత అనే యువతి రూ. 7.35 లక్షలు, భాస్కర్ రూ. 35 వేలు హనుమంతరావు డబ్బును వాడుకోవడంతో పాటు, తన వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.

హనుమంతరావు తన తండ్రి పేరిట ఉన్న కొంత భూమిని తనఖా పెట్టి డబ్బు తీసుకోగా, ఇదే సమయంలో ఆ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి పెరిగింది. వెంటనే డబ్బు ఇవ్వకుంటే ఇంటి ముందు గొడవ చేస్తామని, పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించడంతో మరింత మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నిన్న తన ఇంట్లో భార్య హారిక మెడకు నవారు బిగించి లాగాడు. ఆమె చనిపోయిందని భావించిన తరువాత ఇద్దరు పిల్లలనూ అదే నవారుతో హత్య చేశాడు. తరువాత తాను ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న హారికను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించింది.

తన ఆత్మహత్య లేఖను కంప్యూటర్ లో టైప్ చేసిన హనుమంతరావు, దాని ప్రింటవుట్ తీసి ఘటనాస్థలిలో ఉంచాడు. ఈ లేఖపై జూన్ 18వ తేదీ అని ఉండటంతో, హనుమంతరావు ముందే ఆత్మహత్యకు ప్లాన్ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News