Jammu And Kashmir: ఇక ఉక్కుపాదమే... స్నిప్పర్స్, రాడార్లతో కశ్మీర్ చేరుకున్న ఎన్ఎస్జీ కమాండోలు!
- కశ్మీర్ లో ఇక ఉగ్రవాదం అన్న మాట వినిపించబోదంటున్న కేంద్రం
- శ్రీనగర్ కు చేరిన ఎన్ఎస్జీ కమాండోలు
- ఉగ్రవాదుల ఏరివేతలో నిష్ణాతులైన 100 మంది కమాండోల కవాతు
కశ్మీర్ లో ఉగ్రవాదం అనే మాట వినిపించకుండా చేస్తామని చెప్పిన కేంద్రం, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. శ్రీనగర్ కు సమీపంలోని హుమ్ హానా బీఎస్ఎఫ్ క్యాంపునకు అత్యాధునిక ఆయుధాలతో కూడిన ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) దళం చేరుకుంది. రెండు కిలోమీటర్ల దూరం వరకూ గురి తప్పకుండా బులెట్లను కాల్చే స్నిప్పర్ లు, తుపాకులు, ఆయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పే రాడార్లను ఇక్కడికి తీసుకు వచ్చారు.
కేంద్ర హోమ్ శాఖ ఆదేశాల మేరకు బ్లాక్ యూనిఫాం ధరించిన కమాండోలు శ్రీనగర్ రహదారులపై కవాతు నిర్వహించారు. ఎన్ఎస్జీ హిట్ (హౌస్ ఇంటర్వెన్షన్ టీమ్స్) కమాండో టీమ్ నుంచి గురి చూసి కాల్చే రెండు డజన్ల స్నిప్పర్స్ వచ్చారని, వీరంతా రెండు వారాల క్రితమే తమ శిక్షణను ముగించుకున్నారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పటివరకూ బీఎస్ఎఫ్ స్టేషన్ కు 100 మంది కమాండోలు వచ్చారని, వీరంతా యాంటీ హైజాక్ డ్రిల్స్, ఉగ్రవాదుల ఏరివేతలో నిష్ణాతులని తెలిపారు.
కాగా, రంజాన్ మాసం సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణను పండగ తరువాత ఎత్తివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా, ఆపై బీజేపీ మద్దతు ఉపసంహరణతో రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం గద్దె దిగడం.. గవర్నర్ పాలన మొదలు కావడం తెలిసిందే.