Rain: నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. బయటకెళ్లే ముందు జర భద్రం!
- వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- మళ్లీ 26న భారీ వర్షం కురిసే అవకాశం
- హెచ్చరించిన వాతావరణ శాఖ
తొలకరి ప్రవేశించిన తర్వాత ఒకటి, రెండు రోజులు మురిపించిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో మళ్లీ ఎండలు విజృంభించాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే భానుడి ప్రతాపానికి వేసవి సెలవులు కూడా పొడిగించారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా పడతాయని తెలిపింది. ఈ నెల 26న మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.