women: భోజనంలో విషం కలిపిన మహిళ.. ఐదుగురి మృతి.. మరో 120 మందికి అస్వస్థత
- మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలో ఘటన
- తనను ఎగతాళి చేస్తున్నారని పగ
- ఫంక్షన్ లో కలకలం
మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వేడుకకు వచ్చిన బంధువులు విషం కలిపిన భోజనాన్ని తిన్నారు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 120 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని గుర్తించారు. ప్రగ్యా సర్వేశ్ అనే మహిళే ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. ఆమెను బంధువులు పదే పదే ఎగతాళి చేసేవారు. శరీర రంగు బాగోలేదని, వంట కూడా సరిగా చేయలేదని కామెంట్లు చేసేవారు. దీంతో ఆమె వారిపై పగ పెంచుకుంది. ఇటీవల ఆమె తన బంధువైన సుభాష్మానే ఇంట్లో వేడుకకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెను మిగతా బంధువులు ఎగతాళి చేస్తూ మాట్లాడారు. దీంతో అతిథులకు వడ్డించే భోజనంలో పురుగుల మందు కలిపి, ఇంతటి విషాదానికి కారణమైంది.
భోజన శాంపిల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా ఆహారంలో పురుగుల మందు కలిసినట్లు నిర్ధారించడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులకు ప్రగ్యాపై అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయట పడింది. ఆమె వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆమెపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.