America: 32 ఏళ్ల క్రితం నాటి అత్యాచారం, హత్యకేసు.. నిందితుడిని పట్టించిన రెస్టారెంట్ నేప్కిన్!
- 66 ఏళ్ల వయసులో పట్టుబడిన నిందితుడు
- నిందితుడికి అరదండాలు
- అమెరికాలో ఘటన
మూడు దశాబ్దాల క్రితం నాటి చిన్నారి అత్యాచారం, హత్య కేసును ఓ నేప్కిన్ సాయంతో పోలీసులు ఛేదించారు. దశబ్దాలు గడిచిపోయిన కేసులో ఇక తనను పట్టుకోవడం అసాధ్యం అనుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఫస్ట్ డిగ్రీ మర్డర్, ఫస్ట్ డిగ్రీ రేప్ కింద అభియోగాలు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గ్యారీ చార్లెస్ హర్ట్‌మన్ (66)ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..
టకోమా (వాషింగ్టన్)కు చెందిన మిచెల్లా వెల్చ్.. తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి మార్చి 26, 1986లో పుగెట్ పార్క్‌కు వెళ్లింది. ఉదయం 11 గంటల సమయంలో లంచ్ తెస్తానంటూ సైకిలుపై ఇంటికి వెళ్లింది. దీంతో చెల్లెళ్లు ఇద్దరూ రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. వారు అక్కడి నుంచి వచ్చాక కూడా సోదరి రాలేదు. దీంతో మరికాసేపు పార్క్‌లో ఆడుకున్నారు. కాసేపటికి సోదరి సైకిలు, లంచ్ బాక్స్ పార్క్‌లోని ఓ మూల కనిపించాయి కానీ సోదరి కనిపించలేదు. దీంతో వారు వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఆ రోజు రాత్రి మిచెల్లా మృతదేహాన్ని అక్కడికి పావుమైలు దూరంలో కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీస్ చీఫ్ డాన్ రామ్స్డెల్ తెలిపారు. ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి నిందితుడికి సంబంధించి డీఎన్ఏ ప్రొఫైల్‌ను అభివృద్ధి చేశారు. అయితే, అది జాతీయస్థాయిలో రికార్డుల్లో ఉన్న నేరస్తుల జాబితాలోని ఏ ఒక్కరితోనూ సరిపోకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
చివరికి 2016లో జన్యుశాస్త్రవేత్త సాయంతో నిందితుల వేటను తిరిగి ప్రారంభించారు. జెనాలజీని వంశవృక్షాన్ని తయారుచేసేందుకు ఉపయోస్తారు. దీని ద్వారా ఇద్దరు సోదరులను పోలీసులు అనుమానించారు. హర్ట్మన్ను ఫాలో అయిన పోలీసులు ఓ రెస్టారెంట్లో కాఫీ తాగిన తర్వాత నేప్కిన్ను పలుమార్లు ఉపయోగించడం చూశారు. నేప్కిన్ను నలిపేసి దానిని ఓ సంచిలో వేయడాన్ని పోలీసులు గుర్తించారు. తర్వాత ఆ సంచిని అక్కడే వదిలి వెళ్లిపోయాడు.
అనుమానం వచ్చిన పోలీసులు ఆ నేప్కిన్ను స్టేట్ పెట్రోల్ క్రైమ్ లేబరెటొరీకి పంపించి పరీక్షలు చేయించగా, పోలీసులు అభివృద్ధి చేసిన డీఎన్ఏ ప్రొఫైల్‌తో సరిపోలింది. దీంతో నిందితుడికి అరదండాలు వేశారు.