Heart: 94 నిమిషాల్లో 323 కిలోమీటర్లు ప్రయాణించిన గుండె.. విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స!
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 13 ఏళ్ల బాలుడు
- ఔరంగాబాద్ నుంచి ముంబైకి గుండెను తరలించిన వైద్యులు
- నాలుగేళ్ల బాలికకు విజయవంతంగా గుండె మార్పిడి
నాలుగేళ్ల బాలికకు గుండె అమర్చేందుకు వైద్యులు పెద్ద సాహసమే చేశారు. ఓ బాలుడి నుంచి సేకరించిన గుండెను 94 నిమిషాల్లో 323 కిలోమీటర్ల దూరం తరలించి చిన్నారికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్య సిబ్బంది సంతోషంలో మునిగిపోయారు. ముంబైలోని ములుంద్‌లో ఉన్న ఫోర్టిస్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. బాలిక ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
ఔరంగాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 13 ఏళ్ల బాలుడి గుండెను వైద్యులు సేకరించారు. మధ్యాహ్నం 1:15 గంటలకు ఆసుపత్రి నుంచి ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టుకు గుండెను తరలించారు. 4.8 కిలోమీటర్ల ఈ దూరాన్ని కేవలం నాలుగు నిమిషాల్లో చేరుకున్నారు. ఇందుకోసం పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి చార్టెడ్ విమానంలో ముంబైకి తరలించారు. 3:05 గంటలకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న గుండెను, అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి గ్రీన్ కారిడార్ ద్వారా 19 నిమిషాల్లో తరలించారు.
3:24 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న గుండెను నాలుగేళ్ల బాలికకు అమర్చారు. ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం బాలిక అబ్జర్వేషన్లో ఉందని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.