DELHI METRO: అనుకూలమైన, సౌకర్యవంతమైన, చౌకైన రవాణా వ్యవస్థను నిర్మించడానికే ప్రాధాన్యతిస్తాం!: ప్రధాని
- సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం మెట్రో రైలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి
- దేశీయంగానే మెట్రో కోచ్ ల తయారీకి ప్రోత్సాహం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ మెట్రోలో భాగమైన ముంద్కా-బహదుర్కా సెక్షన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనుకూలమైన, సౌకర్యవంతమైన, అందుబాటు ధరలతో కూడిన రవాణా వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్పారు. మెట్రో కోచ్ లను భారత్ లోనే తయారు చేసే విధంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.
‘‘ఢిల్లీ మెట్రో, ఇతర మెట్రోల నిర్మాణం విషయంలో పలు దేశాలు సహకరించాయి. ఇప్పుడు ఇతర దేశాల మెట్రోలకు కోచ్ లను డిజైన్ చేయడం ద్వారా వారికి భారత్ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. మెట్రో రైలు సహకార సమాఖ్య వ్యవస్థతో అనుసంధానమై ఉందన్న ప్రధాని, దేశంలో ఎక్కడైనా మెట్రో నిర్మిస్తే అందులో కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉంటుందని వివరించారు. ‘‘నూతన భారత్ కు స్మార్ట్ సదుపాయలు కావాలి. రోడ్లు, రైల్వేలు, హైవేలు, ఎయిర్ వేలు, వాటర్ వేలపై పనిచేస్తున్నాం. అనుసంధానత, అభివృద్ధి ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాం’’ అని చెప్పారు.