cuddapah: ఈ పోరాటంతో మోదీ దిగిరాక తప్పదు: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు
- సీఎం రమేష్ కు రాఘవేంద్రరావు, మంత్రుల సంఘీభావం
- స్టీల్ ప్లాంట్ ఇచ్చి తీరుతారు
- వైసీపీ నేతలు హేళనగా మాట్లాడటం తగదు: మంత్రులు
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన సంఘీభావం తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి ప్రధాని మోదీ దిగి రాక తప్పదని, స్టీల్ ప్లాంట్ ఇచ్చి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు చేస్తున్న పోరాటం ఎంతో అవసరమని అన్నారు.
కాగా, సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్, ఎంపీ టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే బోండా ఉమ తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, సీఎం రమేష్ చేస్తున్న దీక్షపై వైసీపీ నేతలు హేళనగా మాట్లాడటం సబబు కాదని అన్నారు.
ఏపీలో జగన్ నాటకాలాడుతూ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కాళ్ల బేరాలాడుతున్నారని, ఆ పార్టీతో కలిసి జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పట్టుదల, పౌరుషానికి ప్రధాని మోదీ దిగి రాక తప్పదని అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు చంద్రబాబు వెనక్కి తగ్గబోరని మరోసారి స్పష్టం చేశారు. కడప ఉక్కు దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, తనపై ఉన్న అవినీతి కేసుల మాఫీ కోసం బీజేపీతో కుమ్మక్కైన జగన్ రాష్ట్రాన్ని మర్చిపోయారని మండిపడ్డారు.