devineni uma: పార్టీలు మారి మమ్మల్నే విమర్శిస్తారా?: పురందేశ్వరికి మంత్రి దేవినేని కౌంటర్
- మొన్నటి దాకా సోనియా వరం అన్నవారు.. ఇప్పుడు మోదీ వరం అంటున్నారు
- పురందేశ్వరి, కన్నాలు బీజేపీలోకి ఎప్పుడు వచ్చారు?
- పోలవరం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరంను బీజేపీ నేతలు సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన వరం పోలవరం అని అన్నారు. నిర్మాణానికి అవుతున్న ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు.
పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు బీజేపీలోకి ఎప్పుడు వచ్చారని ఉమ ప్రశ్నించారు. కొంత కాలం క్రితం సోనియాగాంధీ వరం అన్నవాళ్లు... ఇప్పుడు మోదీ వరం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని... ఏ ఒక్క ప్రాజెక్టు వివరాలను కూడా ఆన్ లైన్ లో పెట్టలేని అసమర్థతలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.