BJP: అది మీ ఇష్టం.. ఒంటరిగా పోటీ చేసే స్వేచ్ఛ మీకుంది: బీజేపీకి తేల్చిచెప్పిన జేడీయూ
- లోక్సభ సీట్ల పంపకం విషయంలో విభేదాలు
- మొత్తం 40 సీట్లలోనూ పోటీ చేసుకోవచ్చన్న జేడీయూ
- నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బీజేపీ నేతలకు హెచ్చరిక
తమతో పొత్తు వద్దనుకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్వేచ్ఛ బీజేపీకి ఉందని జేడీయూ తేల్చిచెప్పింది . బీహార్లోని సంకీర్ణ ప్రభుత్వంలో ఇటీవల లుకలుకలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని 40 లోక్సభ స్థానాల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జేడీయూ జనరల్ సెక్రటరీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నితీశ్ లేకుండా బీహార్లో తాము గెలవలేమని బీజేపీకి కూడా తెలుసు. మాతో కనుక పొత్తు వద్దనుకుంటే రాష్ట్రంలోని 40 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసుకోవచ్చు. మాకేమీ అభ్యంతరం లేదు’’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అనవసర, అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నేతల నోళ్లను అదుపులో పెట్టాలని బీజేపీకి సూచించారు. ‘‘రాష్ట్రంలోని బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’’ అని ఆయన హెచ్చరించారు.
2014లో గెలిచిన అన్ని లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ఇటీవల బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో మిత్ర పక్షాలను కూడా గౌరవిస్తుందని పేర్కొన్నారు. సీట్ల పంపకం సరైన పద్ధతిలో చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని 40 సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో బీజేపీ 22 లోక్సభ స్థానాలను గెలుచుకోగా, మిత్ర పక్షాలు మరో 9 సీట్లు గెలుచుకున్నాయి. జేడీయూ రెండింటితోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఆ సీట్లన్నీ తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అది కుదరని పని అని జేడీయూ చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.