ttd: టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారు పదవి నుంచి రమణదీక్షితులు తొలగింపు
- టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశంలో నిర్ణయం
- ఆగమ సలహా మండలి సభ్యుడిగా వేణుగోపాల దీక్షితులు
- అర్చకులుగా మిరాశి వంశస్థులైన 12 మంది నియామకం
మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుకు టీటీడీ షాక్ ఇచ్చింది. ఆగమశాస్త్ర సలహాదారు పదవి నుంచి ఆయనను తొలగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశంలో ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చ నిర్వహించారు.
తిరుమల శ్రీవారి విరాళాల వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలని, తెలుగు రాష్ట్రాల్లో ఈ-దర్శన్ కౌంటర్లు నిర్వహించాలని పలువురు సభ్యులు సూచించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం అభివృద్ధికి మొదటి విడత రూ.36 కోట్లు, తిరుమలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 కోట్లు, ప్రకాశం జిల్లా దుద్దుకూరులో చెన్నకేశవస్వామి ఆలయం పునరుద్ధరణకు రూ.25 లక్షలు కేటాయించినట్టు టీటీడీ ఈవో తెలిపారు.
తిరుమలలో రూ.70 కోట్లతో భక్తుల వసతి సముదాయం నిర్మాణానికి స్థల పరిశీలనకు నిర్ణయించినట్టు చెప్పారు. కాగా, ఆగమ సలహా మండలి సభ్యుడిగా ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులును టీటీడీ నియమించింది. అర్హులైన మిరాశి వంశస్థులైన 12 మందిని అర్చకులుగా నియమించామని, ఇందులో నలుగురు తిరుమలకు, మిగిలిన 8 మందని గోవిందరాజుస్వామి ఆలయంలో అర్చకులుగా నియమించినట్టు చెప్పారు.