BJP: డిసెంబరు వరకు ఎందుకు.. అక్టోబరులోనే ముందస్తుకు వెళదాం!: బీజేపీ తాజా యోచన
- పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్ణయం
- సెప్టెంబరులో ఎన్నికల షెడ్యూలు?
- ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం
ఎలాగూ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నప్పుడు డిసెంబరు వరకు ఆగడం ఎందుకని, అక్టోబరులోనే నిర్వహిస్తే ఓ పని అయిపోతుందని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడిదే అంశంపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా అక్టోబరుకే ఓటేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 18న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ముందస్తు ఎన్నికలపై ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.
ముందస్తు ఎన్నికలపై అభిప్రాయ సేకరణ కోసం తొలుత పార్టీ సీనియర్ నేతలు ఓ అంతర్గత సదస్సు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అనంతరం మిత్రపక్షాలతో సమావేశమై చర్చించి ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. వారి ప్రతిపాదన ఆధారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంటే కనుక, పర్యవసానంగా సెప్టెంబరులో ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుంది.
బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు జవసత్వాలు పూర్తిగా కూడగట్టుకోకముందే వాటిని దెబ్బతీయాలనేది మోదీ వ్యూహం. అందులో భాగంగానే లోక్‌సభతో పాటు మరో 15 రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనేది మోదీ వ్యూహంలో భాగం. ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి వారు తేరుకునేలోపే దెబ్బకొట్టాలని, తద్వారా మరోమారు అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోంది.