ntr: ఎన్టీఆర్ కి ఎదురుగా కూర్చుని కథ చెప్పడమంటే మాటలా?: పరుచూరి గోపాలకృష్ణ
- 'అనురాగదేవత' స్క్రిప్ట్ లో మార్పులు చెప్పాను
- ఎన్టీఆర్ గారు ఎంతగానో మెచ్చుకున్నారు
- తన కోసం మంచి కథను సిద్ధం చేయమన్నారు
తెలుగు సినిమా కథలను .. సంభాషణలను కొత్త మార్గంలో పరుగులు తీయించిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ గారితో మా తొలి సినిమా 'అనురాగదేవత' .. తాతినేని రామారావుగారు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ గారు మమ్మల్ని పిలిచి "ఈ సినిమాకి రచయితలు మీరే" అని చెప్పారు. అప్పటివరకూ తాతినేని రామారావుగారితో మాకు పరిచయం లేదు.
ఎన్టీఆర్ ను అప్పటివరకూ నేను దూరం నుంచి అపురూపంగా చూసినవాడిని .. ఒక మెరుపులా మాత్రమే ఆయన కనిపించి మాయమయ్యేవారు. అలాంటి మహానుభావుడితో కలిసి పనిచేయబోతున్నందుకు అప్పుడు మేం పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ కి ఎదురుగా కూర్చుని కథా చర్చలు చేయడమంటే మాటలా? .. అయినా ఆయన ఎదురుగా కూర్చుని 'అనురాగదేవత' సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి మార్పులు చేర్పులు చెప్పాను. 'చాలా బాగా చెబుతున్నారు మీరు .. మా కోసం ఏదైనా కథ రాయవచ్చును గదా' అన్నారు. అలా ఆయన కోసం రాసిన కథే 'చండశాసనుడు' అంటూ చెప్పుకొచ్చారు.